AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయడం లేదు..రేవంత్ రెడ్డి

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ లా ప్రధాని నరేంద్ర మోదీ చెవిలో తాను గుసగుసలు చెప్పలేదని… తనది అంతా బహిరంగమే అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో తన సోదరుడు మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా ప్రచారం సాగిందనీ, అయితే అది అవాస్తవమనీ, తమ్ముడు పోటీ చేయడం లేదని స్పష్టతనిచ్చారు. అలాగే మోదీని పెద్దన్నగా పేర్కొనడంపై బీఆర్ఎస్ టార్గెట్ చేయడంపై స్పందిస్తూ.. తనది అంతా బహిరంగమే అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగినట్లు చెప్పారు. జీఏస్టీ ఆదాయం రూ.500 కోట్లు పెరిగిందన్నారు. ఎల్‌ఆర్ఎస్‌పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తామన్నారు. సీఏంఆర్ఎఫ్‌పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోందని… ఆ తర్వాత చర్యలు ఉంటాయన్నారు. తమ పరిపాలనే రెఫరెండంగా లోక్ సభ ఎన్నికలకు వెళతామన్నారు. 17కు గాను 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ట్యాక్స్ పేయర్స్‌కు రైతుబంధు ఎందుకు? అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే వారికి మాత్రమే రైతుబంధు ఉండాలన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అన్ని ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ జరుపుతామన్నారు. ప్రణీత్ రావు వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతుందని హామీ ఇచ్చారు. జీవో నెంబర్ 3పై కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుందన్నారు. కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేస్తే వంద రోజుల్లోనే పట్టాలెక్కించే ప్రయత్నాలు తాము చేస్తున్నామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌తో దోస్తీ కట్టడంపై స్పందిస్తూ… ఆయన తమకేమీ మిత్రుడు కాదన్నారు. తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా కేసీఆర్ చేస్తున్నాడని విమర్శించారు.

ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది?
తమ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేవారు అలా ఎందుకు పడిపోతుందో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీకి రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. ప్రధాని అంటే దేశానికి పెద్దన్న అనేది వాస్తవమే కదా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరంపై నాలుగు వారాల్లో నివేదిక ఇస్తే ఎన్నికల లోపే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ANN TOP 10