పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి మహబూబ్ నగర్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించింది. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డికి అవకాశం దక్కింది. ఈ మేరకు మంగళవారం నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ నేతలతో తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారితో చర్చించి మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అలాగే నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. అయితే ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్‌తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయిన విషయం తెలిసిందే. అందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్తాలని భావించాయి.
అదే విధంగా ఇద్దరు నేతలు చర్చించగా.. లోక్‌సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ స్థానానికి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. నాగర్ కర్నూల్ ముఖ్య నేతలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తానని కేసీఆర్ అన్నారు. ఇదిలా ఉంటే సోమవారం నలుగురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో కరీంనగర్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబూబాద్ స్థానానికి మాలోత్ కవిత పేర్లను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఐదుగురు అభ్యర్థులు ఖరారు అయ్యారు.









