AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు : కేసీఆర్‌

హైదరాబాద్‌: బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌తో భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. బీఎస్పీ హైకమాండ్‌తో మాట్లాడి అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌, బీఎస్పీ కలిపి పని చేయాలని నిర్ణయించామని కేసీఆర్‌ తెలిపారు. సీట్ల సర్దుబాటు, పొత్తు విధివిధానాలతో పాటు మిగతా విషయాలన్ని రేపు, ఎల్లుండి ప్రకటిస్తామన్నారు. కొన్ని సీట్లలో వారు, మేం కొన్ని సీట్లలో పోటీ చేస్తాం. నాగర్‌కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ పోటీ చేస్తారా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పెద్దపల్లి నుంచి పోటీ చేయొద్దా..? రాష్ట్ర అధ్యక్షుడు కదా.. వరంగల్‌ నుంచి కూడా పోటీ చేయొచ్చు. జనరల్‌ సీట్లలో కూడా పోటీ చేయొచ్చు అని కేసీఆర్‌ తెలిపారు. సిద్ధాంత పరంగా కూడా మేము ఓకే రకంగా ఉన్నామన్నారు.

బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: ఆర్‌ఎస్పీ
ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ ను కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశంలో లౌకిక వాదం ప్రమాదంలో ఉందన్నారు. దేశంలో బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లౌకిక వాదాన్ని నిరంతరంగా కాపాడిన నేత కేసీఆర్‌ అని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం బీజేపీ లాగే ప్రవర్తిస్తోందని ఆరోపించారు. పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో సీట్లపై ఒక్క నిర్ణయం తీసుకుంటామన్నారు.

ANN TOP 10