అమ్మన్యూస్, హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఈ మేరకు సోమవారం బాబు మోహన్‌ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కండువా కప్పి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబూ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇవ్వగా.. అప్పటికి ఆయన ఎన్నికల బరిలో ఉండబోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలిచారు. బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ రేపుతున్న తరుణంలోనే ప్రజాశాంతి పార్టీలో చేరి ట్విస్ట్ ఇచ్చారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి బాబు మోహన్ పోటీ చేస్తారని కేఏ పాల్ తెలిపారు. ఇక బాబూ మోహన్ 2014లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 లో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. 1990 దశకం నుంచి 2014 వరకు బాబు మోహన్ తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. 1999లో టీడీపీ నుంచి పోటీచేసి అందోల్‌లో గెలుపొందారు. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండగా.. వరంగల్ పార్లమెంట్ నుంచి బాబు మోహన్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.









