తెలంగాణలో ఇంటర్మీయట్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే.. ఈ పరీక్షల సందర్భంగా నిమిషం నిబంధనను తీసుకొచ్చింది ఇంటర్మీయట్ బోర్డు. ఈ రూల్ ప్రకారం.. పరీక్షా సమయం వరకు కేంద్రానికి విద్యార్థి ఒక్క నిమిషం ఆలస్యమైనా.. లోపలికి అనుమతించరు. అయితే.. ఈ రూల్‌ను అధికారులు కఠినంగా అమలు చేస్తుండటంతో.. చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యమవుతూ.. ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. కొందరు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోతుంటే.. మరికొందరు మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి వచ్చినా.. కరెక్ట్ టైంకి చేరుకుంటామో లేదా అన్న టెన్షన్‌తోనే తాము చదివిన విషయాలన్ని మర్చిపోయి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. నిమిషం నిబంధనను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
పరీక్ష మొదలయ్యే సమయం అంటే.. ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో.. విద్యార్థులకు కొంత ఉపశమనం దొరకనుంది. అయితే.. గ్రేస్ పీరియడ్ ఇచ్చారు కదా మెల్లిగా వస్తే.. మళ్లీ మొదటికే మోసం వస్తుంది. గ్రేస్ పీరియడ్ కేవలం 5 నిమిషాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని విద్యార్థులు.. కొద్దిగా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుని.. పీస్ ఫుల్ మైండ్‌తో ఎగ్జామ్ హాల్లోకి వెళ్లేలా చూసుకోండి.