లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కి మరో షాక్ తగిలింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఇప్పటికే నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, తెలంగాణ పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో ఇవాళ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి అజెండాకి ఆకర్షితుడై బీబీ పాటిల్ బీజేపీలో చేరారని లక్ష్మణ్ చెప్పారు. లింగాయత్ సమాజానికి బీబీ పాటిల్ పెద్ద దిక్కని అన్నారు.
బీఆర్ఎస్‌లో రోజుకో వికెట్ పడుతుందని చెప్పారు. ఇంకా చాలా మంది బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోరుకునేవారు బీజేపీలో చేరుతున్నారని తరుణ్ చుగ్ అన్నారు. ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పారు. తండ్రి, కొడుకు, కూతురు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అన్నారు.
రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని బీబీ పాటిల్ అన్నారు. కీలక బిల్లులకు కేంద్రం ఆమోదం తెలిపిందని చెప్పారు. తెలంగాణ, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీలో చేరానని చెప్పుకొచ్చారు. మోదీ, నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డితో కలిసి పనిచేస్తానని చెప్పారు.