మల్కాజిగిరిలో కేసీఆర్, కేటీఆర్‌లో ఎవరు నిలబడినా ఓడించి తీరుతాం
కేటీఆర్‌పై పోటీ చేయడానికి ముఖ్యమంత్రి అవసరం లేదని సామాన్య కాంగ్రెస్ కార్యకర్త చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేటీఆర్ సవాల్‌పై మంత్రి తీవ్ర స్థాయిలో స్పందించారు. గురువారం కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పై విధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. తెలంగాణాలో 17 ఎంపీ సీట్లు గెలిచి తీరుతామన్నారు. కాంగ్రెస్‌కు భయపడే బీఆర్ఎస్ నాయకులు పనికి రాని ఛాలెంజ్ లు విసురుతున్నారన్నారు.
కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతోనే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా గెలవటమే ఇందుకు తార్కాణమన్నారు. రేవంత్‌రెడ్డిని ఎంపీగా గెలిపించటంలో కూకట్‌పల్లి కార్యకర్తల శ్రమ ఎంతో ఉందని తెలిపారు. కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రతి కార్యకర్త కష్టాన్ని కళ్లారా చూశారని, ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకొని చూస్తారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనే మల్కాజిగిరిలో రేవంత్ విజయఢంకా మోగించారన్నారు.