బీజేపీది జేబులు నింపే అజెండా.. కాంగ్రెస్‌ది పేదల కడుపు నింపే అజెండా అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ 420 పార్టీ అని, ఆ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 17 ఎంపీ సీట్లు గెలిచి.. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. అది కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీవి గాడ్ పాలిటిక్స్.. రాహుల్ గాంధీవి పబ్లిక్ పాలిటిక్స్ అంటూ డైలాగ్ పెల్చారు. భారత్ జోడోతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారని, అలాగే ఇప్పుడు న్యాయ యాత్ర పేరుతో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ ఎప్పుడు మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తుందని, రాహుల్ గాంధీ ఎప్పుడూ మతాన్ని రాజకీయం చేయరని పేర్కొన్నారు. బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్లను మొక్కుతున్నట్టు క్రియేట్ చేస్తుందని, దిగజారుడు రాజకీయాలు బీజేపీ చేస్తుందని విమర్శించారు.
ఎమోషనల్ పాలిటిక్స్ బీజేపీ చేస్తుందని, దేవుడి గురించి మాట్లాడే బీజేపీ నేతలు దేశంలో డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరల గురించి మాట్లాడరని మండిపడ్డారు. ధరల పెరుగుదలపై మాట్లాడే ధైర్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని, అలాగే తెలంగాణలో 17 సీట్లు గెలుచుకోవాలని కోరారు. హైదరాబాద్ ఎంపీని మంచి రోజులు వస్తాయని మైనార్టీ సోదరులను కోరారు. రాహుల్ ప్రధాని చేస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత బీజేపీ ఎప్పుడో విస్మరించిందని ఆరోపించారు. బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలుస్తుంది అని ప్రచారం చేసుకుంటుందని, గత 9 ఏండ్లలో తాము ఇది చేశాం అని ప్రజలకు చెప్పే పని చేసిందా అని ప్రశ్నించారు. అయోధ్య గుడి ప్రారంభం కూడా ఎన్నికల ముందు పెట్టుకున్నారని, ఏడాది ముందు ఎందుకు గుడి ప్రారంభం పెట్టుకోలేదని నిలదీశారు. ఓట్ల కోసమే అయోధ్య రామ మందిరం ప్రారంభం చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించే సంప్రదాయం లేదని, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.









