AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తూ తక్షణమే జీవో విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ సంబంధించిన మూడు అంశాలతో హరీష్ రావు లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని, ఆమోదింప చేసిన విషయం మీకు తెలిసిందే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లును కొన్ని వివరణలు కోరుతూ గవర్నర్ తమిళిసై మొదట ఆమోదించలేదని గుర్తు చేశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో ఆర్టీసీ కార్మికులతో కలిసి తెచ్చిన ఒత్తిడి ఫలితంగా గవర్నర్ బిల్లును ఆమోదించారన్నారు. శాసనసభ, గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే అపాయింటెడ్ డే మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో మా ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ నిర్వహించలేకపోయిందని లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేసి, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని, కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని ఇచ్చిన హామీని ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలన్నర గడుస్తున్నా ఇంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన రోజే ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారన్నారు. కానీ నేటి వరకు విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం చాలా పెరిగిందని, బస్సుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ఓవర్ లోడ్ వెహికల్ నడపలేక డ్రైవర్లు, కిక్కిరిసిన బస్సుల్లో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.

అంతేకాక డ్రైవర్లు ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుందని, వారి శ్రమను దృష్టిలో పెట్టుకుని వెంటనే విలీన జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని హరీష్ రావు కోరారు. అలాగే ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం 1000 డీజిల్ బస్సులను కొనుగోలు చేసిందని, అలాగే 500 ఎలక్ట్రిక్ బస్సులను కిరాయికి కూడా తెప్పించిందన్నారు. వాటిని కూడా ఇటీవల ప్రారంభించారని, పెరిగిన మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని కోరుతున్నానని లేఖలో హరీష్ రావు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10