AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరలో వీఐపీల డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్: మంత్రి పొన్నం

రాష్ట్రంలో మహలక్ష్మి ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. రవాణా శాఖ మీద డ్రైవ్ చేస్తున్నామని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ల డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్ పెడతామని చెప్పారు. అనుభవం లేని డ్రైవర్లతో ఈ మధ్య కాలంలో వీఐపీలు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని అన్నారు. వీఐపీ అందరికీ లెటర్ పంపిస్తామని, సుదూర ప్రాంతాలకు కేవలం సెలెక్టెడ్ డ్రైవర్లను నియమించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీపై రూ. 6 వేల కోట్లు అప్పులు చేసిందని, ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని చెప్పారు. మహిళలు రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు వెళ్తున్నారని, దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని వెల్లడించారు. మహాలక్ష్మి ద్వారా రోజుకు 50 లక్షల మంది బస్సులో ప్రయాణం చేస్తున్నారని వివరించారు.

అలాగే కొత్త బస్సులను కొనుగోలు చేశామని, మేడారం జాతరలో రవాణా శాఖ కట్టు దిట్టంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఆటో డ్రైవర్లకు రూ. 12 వేలు ఇస్తామన్న హామీ త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా కులగణన విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, బీహార్ తరహాలో అమలు చేసే యోచనలో ఉన్నామని పేర్కొన్నారు. త్వరలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, కమీషన్‌ను ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నామని తెలిపారు. కులగణన చేసి రాష్ట్రంలో అన్నింటిలో రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీసీ విజయవంతంగా నడవడానికి డ్రైవర్లు, కండక్టర్ల కృషి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను గూర్చిచామని, కార్గో టార్గెట్ 2 వేల కోట్లు, ఇప్పుడు 150 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

ANN TOP 10