హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షణ భాగం (చౌటుప్పల్-అమన్‌గల్-షాద్‌నగర్-సంగారెడ్డి- 182 కి.మీ) జాతీయ రహదారి ప్రకటనకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన తర్వాత ఆర్ఆర్ఆర్ దక్షణ భాగాన్నిజాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు కోరాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ అంశంతో పాటు తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతి , పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాను కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి అందజేశారు. ఆయా రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాల్సిన ఆవశ్యకతను వివరించారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అధికారిక నివాసంలో మంగళవారం మధ్యాహ్నం కలిశారు. సుమారు గంటన్నరపాటు కొనసాగిన భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, జాతీయ రహదారుల పనులకు సంబంధించిన వివిధ సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ ఐఎఫ్ (కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సూచించారు.