AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కులగణనపై అనుమానాలు వద్దు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కులగణనపై ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాలు వ్యాఖ్యలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కుల గణన తీర్మానం చర్చలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చట్ట సభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేలా కులగణన చేపడుతామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జస్టిస్ కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్‌ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ సమగ్ర సర్వే చట్ట సభలో ప్రవేశ పెట్టారా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్ అప్పుడు తప్పుడు సర్వేలు వాడుకుందని మండిపడ్డారు. తమకు రాజకీయ దురుద్దేశాలు లేదని, కులగణనపై అనుమానాలు వద్దని సూచించారు. కులగణనపై అనుమానాలు ఉంటే సలహాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తీర్మానంలో లీగల్ చిక్కులు ఉంటే ప్రతిపక్షాలు తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలని అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పు తొవ్వ పట్టిస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలపై ఒకరోజు చర్చ పెడుదామని, 2014, 2018, 2023 మేనిఫెస్టోలపై ప్రత్యేకంగా చర్చింద్దామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మంత్రివర్గ నిర్ణయంతో తీర్మానం ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. గత పదేళ్లు అధికారంలో ఉండి మీరేం చేశారు.. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మేము ఏం చేశామన్నది చర్చిద్దామని చెప్పుకొచ్చారు. సభలో తీర్మానం ప్రవేశపెట్టిందని తామేనని, రాష్ట్రంలోని బలహీన వర్గాలను కూడా బలంగా మార్చే ఉద్దేశమని పేర్కొన్నారు. బాధితులుగా ఉన్న వాళ్లను పాలకులుగా చేయాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ANN TOP 10