ఏపీలో త్వరలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సోమవారం వైసీపీ సభ్యులుగా గొల్ల బాబూరావు, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డిలు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారైన సంయుక్త కార్యదర్శి యం. విజయరాజు వద్ద వారి నామినేషన్లను దాఖలు చేశారు. అంతకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్ వారి ముగ్గురికీ బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 15వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
ఇక టీడీపీ కూడా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్‌ల పదవీ ఖాళీ అవుతుంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అదే విధంగా రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 16న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 20వ తేదీ వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా గురువారం విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 29లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.