తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగాయి. సమావేశాల్లో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. అందులోనూ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. కాగా.. కేటీఆర్‌ను ప్రతిసారి డ్రామారావు అంటూ సంబోధించే రేవంత్ రెడ్డి.. ఈసారి జూనియర్ ఆర్టిస్టు అని, ఆటో రాముడు అంటూ సెటైర్లు వేశారు. కాగా.. హరీశ్ రావు విషయంలో మాత్రం మళ్లీ పాత ముచ్చటే తీసుకొచ్చారు. ఉద్యమం సమయంలో ఒంటిపై పెట్రోలు పోసుకుని.. అగ్గిపెట్టె దొరకని జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొత్త డ్రామాలకు తెరలేపారంటూ హరీశ్ రావును పరోక్షంగా విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి.
ఉద్యమం సమయంలో ఆత్మాహుతికి సిద్ధపడిన క్రమంలో హరీశ్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదంటూ నాటకమాడారంటూ.. కాంగ్రెస్ నేతలు చాలా సార్లు ఆయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విమర్శలపై హరీశ్ రావు గతంలో పెద్దగా పట్టించుకోకపోయినా.. తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. అయితే.. అసెంబ్లీలో కూడా మాటి మాటికి ఈ అగ్గిపెట్టె విమర్శలు చేయటంపై హరీశ్ రావు స్పందించారు.
“మాట్లాడితే.. అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారు సీఎం రేవంత్ రెడ్డి. నాడు అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి కూడా ఘటించలేదు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు. కాంగ్రెసోళ్లు అమరవీరుల పాడే మోసినోళ్లు కాదు. తుపాకులతో ఉద్యమకారులను బెదిరించిన మీకు తెలంగాణ పోరాటం, అమరవీరులకు గురించి తెలుస్తదని అనుకోను. ఇక అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా ఈ అగ్గిపెట్టె ముచ్చట మాట్లాడటం బంద్ చేయండి. తమను కించపరిచి, రాజకీయంగా విమర్శిస్తాం అనుకుంటే.. అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నా.” అంటూ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.









