న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లను కవిత సవాల్ చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆమె ఆరోపిస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలకు ఈడీ పాల్పడకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గత కొద్ది నెలలుగా విచారణ వాయిదా పడుతూ వస్తోంది. కవిత పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరపడం సరికాదని కవిత పిటిషన్లో పేర్కొన్నారు.
నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కవిత పిటిషన్ టాగ్ అయి ఉన్నందున కేసుల స్టేటస్ వివరాలు తెలపాలని, అన్ని కేసుల విచారణ ఒకేసారి చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అభిషేక్ బెనర్జీ , నళిని చిదంబరంల కేసులతో జతచేసి విచారణ జరుపుతామంది. అయితే ఈడీ సమ్మన్లకు కవిత స్పందించడం లేదని ఈడీ తరపు న్యాయవాది ఏఎస్జి ఎస్వీరాజు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సమ్మన్లనే కవిత సవాలు చేసినందున దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. తదుపరి విచారణ వరకు కవితను విచారణకు పిలవబోమని ఈడీ చెప్పిందని కపిల్ సిబల్ అన్నారు. తదుపరి విచారణ తేదీ వరకు అంటే మొత్తానికి విచారణకు పిలవబోమని అర్థం కాదని ఈదీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు వివరించారు.









