AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఇకపై కొరత లేకుండా నిరంతర విద్యుత్..’ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన డిప్యూటీ సీఎం..

విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం మానుకోకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్ర‌జ‌లే బుద్ది చెప్తారన్నారు భ‌ట్టి విక్ర‌మార్క‌. బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన కొద్ది మంది సోషల్ మీడియా వీరులు కరెంటు స‌ర‌ఫ‌రాపై తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. తెలంగాణ ప్రజలకు నాణ్య‌మైన విద్యుత్తు తో పాటు ఎటువంటి కోత‌లు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా జరుగుతుందని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్నిప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇందిర‌మ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమ‌ని, ప్రజల కలలు నిజం చేయడమే తమ ధ్యేయమ‌న్నారు. ఫేక్‌ లీడర్స్, సోషల్‌ మీడియా లీడర్స్‌ తెలంగాణలో విద్యుత్తు కోత‌లు ఉంటే బాగుంటుందని కలలు కంటున్నారని, వారి కలలు వికృతి కలలని, అటువంటి వారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారనన్నారు. తెలంగాణలో విద్యుత్ సరఫరా గత సంవత్సరంతో పోలిస్తే 2023 డిసెంబర్ 07 నుండి గణనీయంగా మెరుగుపడిందని వివ‌రించారు. 2023 డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 207.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామ‌ని, 2022 డిసెంబర్ లో సగటున 200 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశార‌ని చెప్పారు.

2024 జనవరి 1 నుంచి 28 వరకు, రాష్ట్రంలో సగటున 242.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామ‌న్నారు. గతేడాది ఇదే కాలంలో సగటున 226 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అయ్యింద‌న్నారు. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 2024 వరకు విద్యుత్తు డిమాండ్‌ను తీర్చడానికి తగిన‌ చర్యలు తీసుకున్నామ‌ని తెలిపారు. వ‌చ్చే వేస‌విని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా వివిధ రాష్టాల‌తో జ‌రిగిన ద్వైపాక్షిక ఒప్పందం ప్ర‌కారం1200 మెగావాట్ల విద్యుత్తును ముంద‌స్తుగా రిజ‌ర్వు చేసుకున్నామ‌ని చెప్పారు.

ఆ రాష్ట్రాల‌లో విద్యుత్తు కొర‌త ఉన్న‌ప్పుడు తిరిగి ఇచ్చారని తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రాలో ఏలాంటి అంత‌రాయం లేకుండా ముంద‌స్తుగా మెయింటేనెన్స్ ప‌నులు కూడా చేప‌ట్టామ‌న్నారు. నాణ్యమైన‌ విద్యుత్‌ను కోత‌లు లేకుండా స‌ర‌ఫ‌రా చేయాడానికి కావాల్సిన చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. విద్యుత్ సరఫరా విషయంలో సోషల్ మీడియాలో వ‌స్తున్న తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10