AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ అంటే మోదీకి భయం పట్టుకుంది.. ఖర్గే

డెహ్రాడూన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తనను తాను విష్ణుమూర్తి (Lord Vishnu) 11వ అవతారంగా అనుకుంటున్నారని, మతాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) నిశిత విమర్శలు చేశారు. ప్రజలు ఉదయం లేవగానే దేవీదేవతలు, గురువుల ముఖాలు చూడడానికి బదులు తన ముఖమే చూడాలని ప్రధాని కోరుకుంటున్నారని అన్నారు. డెహ్రూడూన్‌లోని బన్నూ స్కూల్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఖర్గే మాట్లాడుతూ, విష్ణుమూర్తి దశావతారులు గురించి అందరికీ తెలుసునని, ప్రధాని ఇప్పుడు విష్ణువు 11వ అవతారంగా అనిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మతపరమైన సెంటిమెంట్లను ఉపయోగించుకుని ఈఏడాది లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీని తిప్పికొట్టాలని ప్రజలను కోరారు.

కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను చూసి బీజేపీ భయపడుతోందని, ఆ కారణంగానే వారిని ఆడిపోసుకుంటోందని ఖర్గే అన్నారు. జహహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా బీజేపీ నేతల కలల్లోకి వస్తుండటంతో వారికి నిద్రపట్టడం లేదన్నారు. కాంగ్రెస్ పట్ల ఉన్న భయంతోనే బీజేపీ అధికారంలో ఉన్న అసోంలో కాంగ్రెస్ పర్యటనలను అడ్డుకుంటోందన్నారు. కాంగ్రెస్ ర్యాలీపై రాళ్లు విసిరారని, పోస్టర్లు చించివేసి, జెండాలు తొలగించారని చెప్పారు. కాంగ్రెస్ యాత్రలకు ఒక్క అసోంలో మినహా ఎక్కడా అంతరాయం కలగలేదని, అడ్డుకోలేదని అన్నారు. ఈ తరహా ఎత్తుగడలకు తాము భయపడేది లేదన్నారు. ప్రజల హక్కులు కాపాడేందుకు, ప్రభుత్వ తప్పిదాలపై పోరుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెస్ నేతలు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, స్వాతంత్ర్యం కోసం, దేశ సమైక్యత కోసం తమ ప్రాణాలను అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రజలకు ఎప్పుడూ పార్టీ అండగా నిలబడుతుందని చెప్పారు.

యువతకు ఉద్యోగాల్లేవు..
రైల్వేలతో సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 30 లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యువతకు తగినన్ని ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని ఖర్గే విమర్శించారు. అగ్నివీర్ పథకం ద్వారా నాలుగేళ్లు ఉపాధి కల్పించి, ఆ తర్వాత నుంచి యువతకు ఉపాధి లేకుండా చేస్తుందని ఖర్గే అన్నారు.

ANN TOP 10