బీఆర్ఎస్ నేతలు తమకున్న అహంకారంతోనే ప్రజలకు దూరమయ్యారని విమర్శించారు బీజేపీ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ అమరవీరులకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కష్టపడేవారికి బీఆర్ఎస్లో ఏనాడూ గుర్తింపులేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి సీట్లు ఇస్తామని కేటీఆర్, హరీశ్ రావు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పేరును ప్రచారానికి ఉపయోగించుకుని ఉద్యమకారులకు అన్యాయం చేశారని బీఆర్ఎస్పై మండిపడ్డారు. మల్లన్న సాగర్, పోచమ్మ సాగర్ పేరు చెప్పి, ప్రజల వద్ద వందల కోట్లు దోచుకున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణ సమాజం అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని, మీ పార్టీని బొందపెట్టారని కేసీఆర్ను ఉద్దేశించి దుయ్యబట్టారు. భారతీయ జనతా పార్టీపై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక పదవుల్లో ఉంటూ రూ. వందల కోట్లు సంపాదించిన అధికారులకు రాజకీయ పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. సీట్లు అమ్ముకోవడం.. డబ్బు దండుకోవడమనే ఆలోచనతో బీఆర్ఎస్ పనిచేస్తోందని రఘునందన్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకోలేదని రఘునందన్ రావు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై రఘునందన్ రావు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్నటి అయోధ్య కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాలేదని గుర్తు చేశారు. భారత రాష్ట్ర సమితిని ఖతం చేసేందుకు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి, బీఆర్ఎస్ను కాల్చే అవసరం తమకు లేదంటూ కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు.









