మహేందర్ రెడ్డి పేరు ఖరారు
గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెల్లడి
త్వరలోనే సభ్యుల నియామకం కూడా
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ పేరు దాదాపు ఖరారు అయ్యింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి భర్తీపై దృష్టి పెట్టారు. చైర్మన్‌తో పాటు సభ్యుల పోస్టుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వాటిని సోమవారం సెర్చ్ కమిటీ పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలోని ఈ కమిటీ సమావేశంలో లా సెక్రటరీ తిరుపతి, జీఏడీ అధికారి నిర్మల పాల్గొన్నారు. చైర్మన్ రేసులో మాజీ డీజీపీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే చైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దరఖాస్తు చేసుకున్న వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించినట్లు సమాచారం.
గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. అందుకే పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి.. చైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి చర్చించారు. అధికారులు కేరళ వంటి రాష్ట్రాలకు వెళ్లి అక్కడి వ్యవస్థను పరిశీలించారు.









