భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ఇవాళ అయోధ్యలో ఆవిష్కృతం కాబోతోంది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. మధ్యాహ్నం 12.29కి బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రామాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయన 3 గంటలపాటూ ఉంటారు. ఇందులో భాగంగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి బాల రాముడి 51 అంగుళాల విగ్రహం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటూ… 4వేల మంది సాధువులు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ.. బహిరంగ కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.10కి కుబేర్ తిలా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ మహా కార్యక్రమం కోసం దేశం, విదేశాల నుంచి సెలబ్రిటీలు అయోధ్యకు వచ్చారు. లక్షల మంది భక్తులు తరలివచ్చారు.









