తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం మూడు రోజుల లండన్ పర్యటన అనంతరం దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. మూసీ అభివృద్ధి మాస్టర్‌ప్లాన్, డిజైన్లపై అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపారు. దుబాయ్ పర్యటనలో భాగంగా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక స్కై స్కాపర్ (ఆకాశ హర్మ్యం) పైకి వెళ్లి ఏరియల్ వ్యూ లా కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు.

చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్‌లో పర్యాటకులను అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సీఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది.. ఎంత ఖర్చయింది..? ఏమేం సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.
హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించేందుకు దేశ విదేశాల్లోని వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగానే సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం లండన్ లో థేమ్స్ రివర్ ఫ్రంట్‌ను, దుబాయ్ లో వాటర్ ఫ్రంట్ ను సందర్శించింది.










