అమరావతి: తనపై ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని.. తాను ఎవరు వదిలిన బాణం కాదని వ్యాఖ్యానించారు. మహిళ కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని సూచించారు. తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించానని చెప్పారు. తాను తన స్వార్థం చూసుకోలేదన్నారు. తెలుగు ప్రజలు బాగుపడాలి కాబట్టే.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు షర్మిల తెలిపారు. రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతోందన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లు.. తెలంగాణ మెట్టినిల్లు అని చెప్పుకొచ్చారు.
అంతేగాక, ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని షర్మిల పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు అధికారంలో రాగానే నియంతలా వ్యవహరిస్తారని మండిపడ్డారు. జాతీయ పార్టీలు అలా ఉండదన్నారు. ఏపీలో 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. జనవరి 23 నుంచి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుందని చెప్పారు. తొమ్మిది రోజులు రోజుకి మూడు జిల్లాలో పర్యటనలుంటాయని, పార్టీలో చేరికలు కూడా ఉంటాయని తెలిపారు. పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లోనూ ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ధ్వజమెత్తారు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ వాళ్లేనని షర్మిల చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారని తెలిపారు. ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలు చెబుతారని షర్మిల వ్యాఖ్యానించారు.









