సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించే అతి ముఖ్యమైనటువంటి ఆటలలో జల్లికట్టు ఒకటి. సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమ ప్రాంతాలలో కోడి పందాలు నిర్వహిస్తే, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జల్లికట్టు నిర్వహిస్తారు. అయితే ప్రమాదకరమైన ఈ జల్లికట్టు ను అడ్డుకోవడం కోసం పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, దశాబ్దాలుగా సాంప్రదాయ క్రీడగా జల్లికట్టు కొనసాగుతూనే ఉంది. ఈ జల్లికట్టు పోటీలలో అనేకమంది గాయాల పాలవుతున్నా ఆట మాత్రం ఆగడం లేదు. కనుమ పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగంపేటలో జల్లికట్టు ప్రారంభమైంది. ప్రతియేటా కనుమ పండుగ రోజు జల్లికట్టును నిర్వహించడం రంగంపేట గ్రామస్తులకు అనాయితీగా వస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంతో పాటు తిరుపతి, పీలేరు నియోజకవర్గాల్లోని 100 గ్రామాలకు పైగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జల్లికట్టును తిలకించారు.
కోడె గిత్తల కొమ్ములకు కట్టిన బహుమతులను గెలుచుకునేందుకు యువకులు పోటీపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం పుల్లయ్యగారిపల్లిలో కూడా జల్లికట్టును నిర్వహించారు. కనుమ రోజు మాత్రమే నిర్వహించే రంగంపేట లోని జల్లికట్టు పోటీలకు ఒక విశేషం ఉంది. ఈ జల్లికట్టు పోటీలలో పశువులకు ప్రత్యేకంగా పలకలను అమరుస్తారు. రంగంపేట లోని వీధులలో వదిలిపెడతారు. ఈ ఎద్దులకు ఎదురెళ్లి వాటిని లొంగ తీసుకుని వాటికి కట్టి ఉన్న పలకలను తమ సొంతం చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీ. బాగా పదునైన కొమ్ములతో ఉండే ఎద్దులను లొంగ తీసుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎవరైతే ఎద్దులను లొంగదీసుకుని వాటికి కట్టిన పలకలను సొంతం చేసుకుంటారో వారు జల్లికట్టు పోటీలలో విజేతలుగా మారినట్టే. అయితే ఒక్కొక్కసారి కొనదేరిన కొమ్మలతో ఉండే ఎద్దులను లొంగ తీసుకోవడం ప్రాణాల మీదకు తెస్తుంది. ఒక్కోసారి తీవ్ర గాయాలు పాలై లేవలేని పరిస్థితికి చేరుకుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకుంటారు. అందుకే ఈ జల్లికట్టు పోటీలను నిర్వహించినప్పుడు గాయపడిన వారికి వెంటనే ప్రధమ చికిత్స చేయడానికి కూడా వైద్య బృందాన్ని సిద్ధం చేసుకుంటారు.









