ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి కారు పల్టీ కొట్టడంతో ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం హుస్నాబాద్ పట్టణ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుస్నాబాద్ పట్టణానికి చెందిన ఎగ్గోజు యశ్వంత్, నారోజు వెంకటేష్, ఎగ్గోజు అఖిల్, కేమ్మసరం అజయ్ నలుగురు స్నేహితులు కలిసి పొట్లపల్లి గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పందిళ్ళ గ్రామం మీదుగా హుస్నాబాద్ వస్తున్నారు. పట్టణ శివారులో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో బస్సు ముందు ఉన్న బైకును తప్పించబోయి కారు పల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న యశ్వంత్ 17 అక్కడికక్కడే మృతి చెందడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. యశ్వంత్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.









