AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడిగడ్డ పిల్లర్లు కుంగిన వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌..

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ జలసౌధ, మేడిగడ్డతో పాటు పలు చోట్ల ఏకకాలంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రైడ్స్ జరిగాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ నీటిపారుదల శాఖ కార్యాలయంలో నిర్వహించిన తనిఖీల్లో అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌లో రెండు టీఎంసీలు, మూడో టీఎంసీకి చెందిన పనులు, పంప్‌హౌస్‌ల ఫైళ్లు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌ హౌస్‌లకు చెందిన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 7 లింక్‌లలో లింక్‌–1 లోని నాలుగు ప్యాకేజీలుగా చేపట్టిన పనులకు సంబంధించిన కీలక ఫైళ్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టు అంచనా వ్యయాలు, సవరించిన అంచనాలు సహా సంబంధిత ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభమైన 2016 నుంచి పూర్తయ్యే నాటికి గల రికార్డులు, పత్రాలు, ఫైళ్లను, జీవో కాపీలను అధికారులు సీజ్‌ చేశారు. ఏఈ నుంచి సీఈ, ఈఎన్సీల స్థాయి వరకూ ఎంతమంది అధికారులు పని చేశారు? ఎవరైనా సస్పెన్షన్‌కు గురయ్యారా? ఏసీబీకి పట్టుబడ్డారా? వారి ఆర్థిక వ్యవహార శైలికి సంబంధించిన డేటా కూడా సేకరిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలపై జ్యుడీషియల్‌ విచారణ కోసం సిట్టింగ్‌ జడ్జిని నియమించాలని తెలంగాణ హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధేకు లేఖ రాశామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. ఆధారాలు తారుమారు చేస్తారనే ఉద్దేశంతో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు ఉత్తమ్‌ వెల్లడించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10