ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో సహా వెళ్లారు వైయస్సార్టీపీ తెలంగాణ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్ షర్మిల. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజా రెడ్డి, కోబోయే కోడలు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని.. అక్కడ్నుంచి సీఎం జగన్ నివాసానికి షర్మిల వెళ్లారు. దాదాపు అరగంటపాటు షర్మిల, జగన్ కుటుంబాలు సమావేశమయ్యాయి. అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతిని కలిసి తన కుమారుడు రాజా రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు షర్మిల. అనంతరం విజయవాడలోని నోవాటెల్ హోటల్ కు బయల్దేరారు. అక్కడ విశ్రాంతి తీసుకుని.. బుధవారం రాత్రి 8.50 నిమిషాలకు ఢిల్లీకి బయల్దేరనున్నారు.
మరోవైపు, వైఎస్ షర్మిలతోపాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్లారు. షర్మిల కాన్వాయ్ వెళ్లిన కాసేపటికి క్యాంపు ఆఫీస్‌కు రావడంతో.. సీఎం నివాసం వైపు వెళ్లకుండా ఆర్కే వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి ఆర్కేను పంపించారు.
గన్నవరం నుంచి వస్తుండగా తన వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో షర్మిల వెంట రాలేకపోయానని ఆర్కే తెలిపారు. షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. షర్మిల ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెప్పారు. ఆ పార్టీ విధివిధానాల ప్రకారం నడుచుకుంటానన్నారు. జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసే విషయమై కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని తెలిపారు. షర్మిలతోపాటు ఎవరెవరు వస్తారనే విషయం తనకు తెలియదని ఆర్కే చెప్పారు.









