సీతక్క మాస్టర్ స్ట్రోక్
కాంగ్రెస్ లో చేరిన పలువురు కీలక నేతలు
ఫలించిన సీతక్క, కంది శ్రీనివాస రెడ్డిల జాయింట్ ఆపరేషన్
సీయం రేవంత్ రెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకున్న నేతలు
ఆదిలాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీతక్క
మరింతగా పెరగనున్న వలసలు
ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ .జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. స్థానిక బీఆర్ఎస్ కు ఊహించని స్ట్రోక్ ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు. శాసనసభ ఎన్నికలకు ముందే కంది శ్రీనివాస రెడ్డి కి మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పార్టీలో చేరగా ఇటీవలే మరికొందరు చేరారు. జిల్లా ఇంఛార్జి మంత్రిగా ,ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి గా మంత్రి సీతక్క బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బీఆర్ఎస్ వికెట్లు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని హస్తగతం చేసుకునేలా ఆమె వేస్తున్న ఎత్తులకు జిల్లాలో బీఆర్ఎస్ చిత్తువుతోంది. సీతక్క, కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ల జాయింట్ ఆపరేషన్ తో జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కీలక నేతలు డిసిసిబి ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి ,సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తో పాటు పలువురు యంపీటీసీలు, సర్పంచ్ లు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కొద్దిరోజుల్లో మరికొందరు కూడా అదే దారి పట్టనున్నట్టు సమాచారం. ఈ వలసలు ఇలాగే కంటిన్యూ అయితే జిల్లాలో బీఆర్ ఎస్ పరిస్థితి ఏంటోనన్న చర్చ సాగుతోంది. అసలే అటు అధికారం కోల్పోయి తీవ్ర నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ పెద్దలకు ఈ వలసలు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంలా మారాయి. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతపై బీఆర్ఎస్ నేటి నుండి నిర్వహిస్తున్నసన్నాహక సమావేశాలలో తొలిరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరవుతారని భావించిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరడంతో జిల్లా బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టైంది. శాసనసభ సీటూ ఎలాగూ పోయింది కనీసం పార్లమెంట్ స్థానాన్నైనా దక్కించుకొని పరువు నిలుపుకుందామని భావిస్తున్న జిల్లా నాయకత్వానికి నిద్ర పట్టకుండా చేస్తోంది. సీతక్క ,కంది శ్రీనివాస రెడ్డి ల వ్యూహాలకు జిల్లాలో ఆ పార్టీ చెల్లా చెదురవుతోంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎంత మంది పోతారో ఎందరు మిగులుతారో అన్నబెంగ స్థానిక బీఆర్ఎస్ నాయకత్వంలో మొదలైంది.









