బిర్యానీ తినేందుకు హోటల్‌కు వెళ్లిన కస్టమర్లను కొట్టిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి బిర్యానీ తినడానికి ఓ కుటుంబం అబిడ్స్‌లోని రెస్టారెంట్‌కు వెళ్లింది. మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు హోటల్‌కు వెళ్లి… బిర్యానీ ఆర్డర్ చేశారు. కానీ వారు ఆర్డర్ చేసిన బిర్యానీ సరిగ్గా ఉడకలేదు. దీంతో తమకు సర్వ్ చేసిన బిర్యానీ బాగా లేదని ఆ ఫ్యామిలీ… హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదన జరిగింది. బిల్లు కట్టే సమయంలో గొడవ ముదిరింది. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది… ఆ ఫ్యామిలీపై కర్రలతో దాడి చేశారు. కొంతమంది వెయిటర్లు తమకు దొరికిన వస్తువులతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి దృశ్యాలను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీశారు. ఈ ఘటనకు సంబంధించి సదరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.









