– ప్రభుత్వ భూమి కబ్జా చేశారంటూ తహసీల్దార్ ఫిర్యాదు
ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడ్డారని బీఆర్‌ఎస్ పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. నగరంలోని షేక్‌పేట్ తహసీల్దార్ అనితా రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లో ఫ్లాట్ నెం. 8–సీలో 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలాన్ని దీప్తీ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఉపేందర్ రెడ్డి, మరికొందరు ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ప్లాట్ నెం. 8–డీలో షౌకత్ ఉన్నీషా అనే వ్యక్తి నుంచి ఉపేందర్ రెడ్డి ప్లాట్‌ను కొనుగోలు చేశారు. దాని పక్కనే 8–సీ కూడా తనదేనని కబ్జా చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి.
గతంలో ఈ స్థలంలో దీప్తీ అవెన్యూ కంపెనీ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్ ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరోసారి అదే స్థలంలో ఉపేందర్ రెడ్డి నిర్మాణాలు చేపట్టారు. దీంతో బంజాహిల్స్ పోలీసుల సహకారంతో తహసీల్దార్ అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది.









