భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్‌హోల్) అధ్యయనమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రోకి అత్యంత నమ్మకమైన ఈ వాహకనౌక ద్వారా ఎక్స్-రే పొలారిమీటర్ (XPoSAT) ఉపగ్రహంతోపాటు మరో పది శాటిలైట్లను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా భారత్ నిలిచింది. 2021లో ఐఎక్స్‌పీఈ పేరుతో నాసా ఈ తరహా ప్రయోగం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు.
అంతరిక్షం అంతు చూసేలా..
సవాళ్లతో కూడుకున్న పల్సర్‌లు, బ్లాక్‌హోల్ ఎక్స్ రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్‌పోశాట్ అధ్యయనం చేయనుంది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్‌పోశాట్‌లో రెండు పేలోడ్స్ ఉన్నాయి. పాలీఎక్స్ (ఎక్స్-కిరణాలలో పొలారిమీటర్ పరికరం), ఎక్స్-రే స్పెక్ట్రోసోపీ, టైమింగ్ (ఎక్స్‌పెక్ట్-ఎక్స్‌స్‌పీఈసీటీ)ను అమర్చారు. పాలీఎక్స్‌ను రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేయగా, ఎక్స్‌పెక్ట్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది. ఖగోళ వస్తువులు, తోకచుకుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్‌పోశాట్ సేకరించనున్నది.









