AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

న్యూఇయర్‌ వేడుకలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 అర్థరాత్రి దాటే వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ (ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే, ఓఆర్‌ఆర్‌పై రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై అనుమతించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహింస్తామని పోలీసులు ప్రకటించారు.

ఖైరతాబాద్‌ వీవీ విగ్రహం కూడలి నుంచి ఫ్లైఓవర్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు, ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ మీదుగా వీవీ విగ్రహం, నిరంకారి, రాజ్‌భవన్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.
బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ జంక్షన్‌ వద్ద ఇక్బాల్‌ మీనార్‌, లక్డీకాపూల్‌, అయోధ్య జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
హిమాయత్‌నగర్‌, లిబర్టీ నుంచి వచ్చే వాహనాల రాకపోకలు ఎగువ ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతించరు. ప్రయాణికులు తెలుగుతల్లి, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎడమ వైపు వెళ్లాలి.
ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వద్ద సెన్షెషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ లేన్‌, లక్డీకాపూల్‌ వైపు మళ్లిస్తారు.
సాధారణ వాహనాల రాకపోకల కోసం సచివాలయానికి ఆనుకొని ఉన్న మింట్‌ కాంపౌండ్‌ లేన్‌ మూసేస్తారు.
సికింద్రాబాద్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ సెయిలింగ్‌ క్లబ్‌ వద్ద కవాడిగూడ కూడలి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం, లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని అశోక్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది.
నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తారు. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌పై వెళ్లేవారు విమానం టికెట్‌ చూపిస్తే ఆర్‌జీఐ విమానాశ్రయానికి అనుమతిస్తారు.
శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌స్పేస్‌, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, రోడ్‌ నంబర్‌ 45 ఫ్లైఓవర్‌, సైబర్‌ టవర్‌ ఫ్లైఓవర్, ఫోరమ్‌ మాల్‌-జేఎన్‌టీయూ ఫ్లైఓవర్, ఖైత్లాపూర్‌ ఫ్లైఓవర్, బాలానగర్‌ ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు.
రాత్రి ఒంటి గంటవరకు మెట్రో రైళ్లు
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మెట్రో రైళ్ల వేళలను పొడిగించినట్లు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి వరకు నగరవాసులంతా సంబురాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండే రైళ్లను 1 గంట వరకు నడుపుతున్నట్లు చెప్పారు.

చివరి రైళ్లు ప్రారంభ స్టేషన్‌ నుంచి రాత్రి 12.15 గంటలకు బయలుదేరి, ఆఖరి స్టేషన్‌కు ఒంటి గంట సమయంలో చేరుకుంటాయన్నారు. నగరవాసులు బాధ్యతాయుతంగా ప్రయాణం చేయాలని, ప్రయాణికులు మద్యం సేవించి, దుర్భాషలాడకుండా మెట్రో రైలు పోలీసులు, సెక్యూరిటీ వింగ్‌లు నిఘా ఉంచుతాయని స్పష్టం చేశారు.

ANN TOP 10