ప్రధాన రహదారులపై మంచు దుప్పటి కప్పుకుంటోంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగ మంచు కారణంగా ఆర్టీసీ బస్సు, డీసీఎమ్ ఢీకొట్టిన సంఘటన కాళేశ్వరం – వరంగల్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగింది.
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొగమంచు ఇదే విధంగా కమ్మేసింది. ప్రధాన రహదారుల పై మంచుదుప్పటి కప్పేసింది.. కళ్ళు మూసుకొని వాహనాలు నడుపుతున్నట్లు పరిస్థితి మారింది. ఎదురుగా ఏముందో అర్దం కాని పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.. వరంగల్ – హైదరాబాద్, వరంగల్ – మహబూబాబాద్, వరంగల్ – కాళేశ్వరం, వరంగల్ – ఏటూరు నాగారం మద్య దట్టమైన పొగమంచుతో ప్రమాదాలు నిత్య కృత్యమవుతున్నాయి.
తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు -డి సి ఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. రేగొండ మండలం భాగిర్తిపేట- కొత్తపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. దట్టమైన పొగమంచు ప్రబావంతో ఆర్టీసీ బస్సు – డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా డీకొన్నాయి. డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని108 ద్వారా హాస్పిటల్ తరలించారు.









