AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు పూర్తి

తమిళ ప్రజలు ముద్దుగా ‘కెప్టెన్’ అని పిలుచుకునే సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయకాంత్ అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. ఆయనకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో కోయంబేడులోని డీఎండీకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవసూచకంగా 72 తుపాకులను గాల్లోకి పేల్చి వందనం సమర్పించారు.

ఈ మధ్యాహ్నం వేలాదిమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరాగా, విజయకాంత్ అంతిమయాత్ర ఐలాండ్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైంది. 12 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర సాగింది. అంతిమయాత్రలో “లాంగ్ లివ్ కెప్టెన్” అనే నినాదాలు మార్మోగాయి. విజయకాంత్ భౌతికకాయాన్ని ఉంచిన వాహనంపై ఆయన భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కాగా, విజయకాంత్ అంత్యక్రియలు నిర్వహించిన డీఎండీకే పార్టీ ఆఫీసు ప్రాంగణంలోకి ప్రజలను ఎవరినీ అనుమతించలేదు. కేవలం విజయకాంత్ కుటుంబ సభ్యులు, వీఐపీలను మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతించారు. ప్రజలు తమ ప్రియతమ కెప్టెన్ అంత్యక్రియలను వీక్షించేందుకు వీలుగా, ఆఫీసు వెలుపల భారీ టెలివిజన్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అన్నాడీఎంకే నేతలు, ఇతర రాజకీయవేత్తలు పుష్పాంజలి ఘటించారు.

అంతకుముందు, ఐలాండ్ గ్రౌండ్స్ వద్ద విజయకాంత్ కు ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, నటులు రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభు, పార్తిబన్, ఖుష్బూ తదితరులు విజయకాంత్ కు నివాళులు అర్పించారు.

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడిన విజయకాంత్, కరోనా బారినపడడంతో కోలుకోలేకపోయారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. విజయకాంత్ మృతితో తమిళనాట విషాద వాతావరణం నెలకొంది.

ANN TOP 10