గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మొఘల్ పురా పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 5కేజీల 900గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు మొఘల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని మెజ్బాన్ హోటల్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, మొఘల్ పురా పోలీసులు వారి సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. సమాచారం అందుకున్న ప్రదేశానికి వెళ్లి చూడగా జావీద్ అనే వ్యక్తి తన ఆటోలో గంజాయి దాచి అమ్ముతున్నాట్లు గుర్తించారు పోలీసులు. ఆటో తనిఖీ చేయగా 87 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. జావీద్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా పురానా పూల్ జుమ్మే రాత్ బజారుకు చెందిన వినోద్ సింగ్ వద్ద నుండి కొనుగోలు చేసి అమ్ముతున్నట్లు తెలిపాడు.
దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు పురానా ఫుల్ జుమ్మేరాత్ బజార్ వద్ద వినోద్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుండి 242 ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు టేప్ చుట్టి ఉన్న మరో రెండు బండలోని 2కేజీల 900గ్రాముల గంజాయి దొరికింది. ఇద్దరి వద్ద నుండి మొత్తం 5కేజీల 900గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ప్యాకెట్లో 10గ్రాముల ఎండు గంజాయి ఉందని తెలిపారు పోలీసులు. వినోద్ సింగ్ ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ నుండి శ్రీను అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. వాటిని హైదరాబాద్‌కు తెచ్చి ప్యాకెట్లుగా తయారు చేసి జావీద్ లాంటి వారికి అమ్ముతున్నట్లు సౌత్ జోన్ అదనపు డీసీపీ షేక్ జహంగీర్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఛత్రినాక ఏసీపీ జి, రమేష్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మధుసుధన్, మొగల్ పురా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాల్గొన్నారు.