సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ హవా కొనసాగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలో సమీప కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీపై 122 ఓట్ల మెజార్టీతో ఏఐటీయూసీ గెలుపొందగా, మందమర్రి 469, శ్రీరాంపూర్ 2166 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లో మొత్తం 94.23 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఏరియాల్లో మొత్తం 14,958 మంది ఓటర్లు ఉండగా 13,965 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 9127 మంది ఓటర్లకుగాను 8491 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 93.0 శాతం పోలింగ్ నమోదైంది. మందమర్రిలో 4835 ఓటర్లకుగాను 4515 మంది ఓటు వేయగా 93.38 శాతం పోలింగ్ నమోదైంది. బెల్లంపల్లి ఏరియాలో 996 ఓటర్లకు గాను 959 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 96.3 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఓట్ల లెక్కింపు కోసం శ్రీరాంపూర్‌లోని సింగరేణి కాలరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్, మందమర్రిలోని సీఈఆర్ క్లబ్, బెల్లంపల్లిలోని గోలేటి సీఈఆర్ క్లబ్‌లో కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించారు.
