AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అత్తాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పసిపిల్లలతో స్థానికుల పరుగులు!

హైదరాబాద్ అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సులేమాన్ నగర్ ఎంఎం పహాడీలోని ఓ కట్టెల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పక్కనే ఉన్న సోఫా తయారీ చేసే పరిశ్రమకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో రెండు గోదాములు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ.. అందులో పార్క్ చేసి పెట్టిన మూడు బైక్‌లు దగ్దమయ్యాయి.

మంటలను గమనించిన స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. క్షణాల మీద వ్యాపించిన మంటలతో ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. చిన్న పిల్లలను తీసుకొని దూరంగా పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఏడు ఫైర్ ఇంజిన్లతో రెండు గంటలు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

నిబంధనలకు విరుద్దంగా జనావాసాల మద్య పరిశ్రమల నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమల్లో ఎక్కడా ఫైర్ సెప్టీ కనిపించటం లేదని.. జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ANN TOP 10