తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బోధన్ (BRS) మాజీ ఎమ్మెల్యే షకీల్.. తన కొడుకు చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా వివాదంలో చిక్కుకోగా.. ఇప్పుడు ఇబ్రహీంపట్నం (BRS) మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై కేసు నమోదైంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్రవంతి ఫిర్యాదు మేరకు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్, మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసఫ్ మీద ఇబ్రహీంపట్నం పోలీసులు 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి కోసం తన దగ్గర రెండున్నర కోట్లు తీసుకున్నారని స్రవంతి ఆరోపించారు. ప్రతి నెలా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే కొడుకు ప్రశాంత్ డిమాండ్ చేశారని ఫిర్యాదు చేశారు. ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన రోజు నుంచి కులం పేరుతో తనను వేధిస్తున్నారని తెలిపారు. పలు సమావేశాల్లో మర్యాద ఇవ్వకుండా మాట్లాడారని చెప్పుకొచ్చారు. వైస్ ఛైర్మన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు.. తరచూ తనను సెలవు పెట్టమని బెదిరించారని స్రవంతి వెల్లడించారు. కిషన్ రెడ్డి చెప్పినట్లు వినలేదని అప్పటి కలెక్టర్ అమాయ్ కుమార్‌తో బెదిరించి తనకు షోకాజ్ నోటీసులు ఇప్పించారని ఫిర్యాదులో స్రవంతి పేర్కొన్నారు. అప్పర్ క్యాస్ట్ తో గొడవపడలేరు.. లీవ్‌లో వెళ్లాలని కలెక్టర్ అమాయ్ కుమార్ బెదిరించారని స్రవంతి ఆరోపించారు.
మున్సిపల్ ఛైర్ పర్సన్ స్రవంతి ఫిర్యాదు మేరకు.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్ రెడ్డి, అప్పటి కలెక్టర్ అమాయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యూసఫ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









