సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్ర కార్మికశాఖ ఆదేశాల మేరకు బుధవారం గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. ఆరేళ్ళుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గుర్తింపు’ ఎన్నికల ఘట్టం ఎట్టకేలకు ముగియనుంది. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పదవీకాలం పూర్తికావడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. నిర్ణీత 2 సంవత్సరాల కాలపరిమితి ముగిసి అదనంగా మరో నాలుగేళ్లు గడిచినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఏఐటీయూసీ కోర్టును ఆశ్రయించడం ద్వారా ఎన్నికలకు మార్గం సుగం చేసింది.
ఏర్పాట్లు పూర్తి….
గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను సింగరేణి అఽధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ నెల 27న ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం శ్రీరాంపూర్‌లోని ఎస్‌సీఓఏ క్లబ్, మందమర్రిలోని సీఈఆర్ క్లబ్, బెల్లంపల్లిలోని గోలేటి సీఈఆర్ క్లబ్‌లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో మొత్తం 14,985 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీరాంపూర్‌లో 9124 మంది ఉండగా, మందమర్రిలో 4876, బెల్లంపల్లిలో 985 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం మూడు ఏరియాల పరిధిలో మొత్తం 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మందమర్రిలో 11 కేంద్రాలు, బెల్లంపల్లి ఏరియాలో 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రెండు సంఘాల మధ్యనే ప్రధాన పోటీ
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రధానంగా రెండు జాతీయ సంఘాలు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య నువ్వా నేనా అనే చందంగా పోటీ నెలకొంది. వరుసగా రెండు పర్యాయాలు గుర్తింపు సంఘంగా కొనసాగిన బీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఈసారి నామమాత్రంగానే తలపడ నుంది. తొలుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు గుర్తింపు ఎన్నికల్లో పాల్గొనవద్దని నిర్ణయించగా, నిరుత్సాహానికి గురైన సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజీనామాలు చేశారు. ఇదే బాటలో సంఘ సభ్యులు అనేక మంది సంఘం నుంచి వెళ్లిపోయి ఇతర సంఘాల్లో చేరారు. దీంతో అప్రమత్తమైన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత గుర్తింపు ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా సూచించారు. అయితే అప్పటికే సంఘం నుంచి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీల్లోకి పెద్ద మొత్తం లో వలసలు పెరగడంతో జరగాల్సిన నష్టం జరిగింది. ఇదిలా ఉండగా, ఎన్నికల ప్రచారంలోనూ ఆ సంఘం నుంచి పెద్దగా స్పందన కనిపించ లేదు. దీనికితోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురూ ఓటమి పాలుకావడంతో ‘గుర్తింపు’ ప్రచారంలో పాల్గొనలేదు. ఈ కార ణంగా టీబీజీకేఎస్ నాయకుల్లో తీవ్రమైన నిరాశ నిస్ప్రహలు అలుము కున్నాయి. ఇదిలాఉండగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే గెలుపొందడంతో దాని అనుబంధ ఐఎన్టీయూసీలో ఉత్సాహం నెలకొంది. దీనికి తోడు మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఐఎన్టీయూసీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతోపాటు ప్రచారంలోనూ పాల్గొన్నారు.









