మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండల కేంద్రంలో దొంగతనం జరిగింది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారు జామున ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు అమ్మవారి నగలను దోచుకున్నారు. ముఖానికి మంకీ క్యాప్ ధరించిన ఓ వ్యక్తి అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి తలపై కిరీటంతోపాటు, మెడలో నగలు, ఇతర వస్తువులను దోచుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోమవారం తెల్లవారు జామున 2గంటల సమయంలో ఈ చోరీ జరిగింది.
చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆలయంలోని సుమారు రూ. 5లక్షల నగదు, 3 తులాల బంగారం, ఐదు కిలోల వెండి వస్తువులను దొంగలు చోరీకి పాల్పడినట్లు తెలిసింది.