తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.. స్వేదపత్రం రిలీజ్ చేశారు. తెలంగాణ వాస్తవ ముఖచిత్రం ఇదే అని తెలంగాణ భవన్‌లో తెలిపారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా నిలబడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తుండటంతో, ఈ వంకతో తమపై బురద చల్లుతున్నారంటూ… బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో స్వేదపత్రం పేరుతో తమ పాలన ఎలా సాగిందో వివరిస్తూ.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో అద్భుతమైన పరిపాలన సాగించిందన్న కేటీఆర్.. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండించే ఉద్దేశంతో ప్రజలకు నిజాలు తెలియాలన్న ఉద్దేశంతో ఈ స్వేద పత్రం రిలీజ్ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. విధ్వంసం నుంచి వికాసం, సంక్షోభం నుంచి సమృద్ధివైపు తమ ప్రయాణం సాగిందని కేటీఆర్ వివరించారు. గత పాలకులు 60 విధ్వంసానికి పాల్పడగా.. గత పదేళ్లలో మంచి పాలన అందించామని కేటీఆర్ అన్నారు.
40 నిమిషాల పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో ఆయన.. సమైక్య పాలనలో దశాబ్దాలపాటూ తెలంగాణ దగా పడిందని తెలిపారు. అన్ని రంగాల్లో నేరపూరిత నిర్లక్ష్యం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకున్నామని కేటీఆర్ తెలిపారు. కరెంటు సంక్షోభం, నీటి కొరత, పేదరికం, శాంతిభద్రతల కొరత ఇలా ఎన్నో సవాళ్లు ఉండగా.. వాటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగామని కేటీఆర్ తెలిపారు. విఫల రాష్ట్రంగా మారిన తెలంగాణను సమర్థంగా తీర్చిదిద్దామన్నారు. కరోనా కారణంగా రెండేళ్లపాటూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందనీ, నోట్ల రద్దు కారణంగా మరో పెద్ద దెబ్బ తగిలిందనీ, ఇవన్నీ తీసేయగా.. ఆరున్నర ఏళ్లపాటూ తాము పాలన సాగించగలిగామని కేటీఆర్ తెలిపారు.