AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళలూ అలా చేయెద్దు.. సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్

మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఈనెల 9 నుంచి ఈ ఫ్రీ జర్నీ పథకం అమల్లోకి రాగా.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కైడికైనా ప్రయాణించవచ్చు. ఏదైనా తెలంగాణ స్థానికతతో కూడిన ఐడీ కార్డు చూపించి.. జీరో టికెట్ ద్వారా ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.

దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బస్సుల్లో రద్దీ పెరిగింది. రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ సోమవారం రికార్డును బద్దలు కొడుతూ 51 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగించినట్లు అధికారులు తెలిపారు. గతంలో 40 శాతం మంది మహిళలే బస్సుల్లో ప్రయాణాలు సాగించగా.. ఈ పథకం అమల్లోకి వచ్చాక వారి సంఖ్య 60 శాతానికి పెరిగింది. బస్సుల్లో రద్దీ ఉంటున్న నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్ని చోట్ల పురుషులు తమకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 100, 200 కిలోమీటర్లు నిల్చొనే ప్రయాణాలు సాగించాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్ చేసారు. ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని.. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని.. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందన్నారు.

ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని.. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని సజ్జనార్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10