స్వగ్రామానికి వచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు
అతని సోదరుడు మహవీర్ కూడా..
ఆందోళనలో ప్రశాంత్ కుటుంబీకులు
బిగ్‌బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను బుధవారం రాత్రి అతని స్వగ్రామం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు స్థానిక సీఐ జాన్‌రెడ్డితో కలిసి ఇక్కడి పోలీసు సిబ్బంది సహకారంతో ప్రశాంత్ ఇంటివద్దకు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్‌తో పాటు పలువురిపై నగరంలో చోటు చేసుకున్న ఆర్టీసీ బస్సుల అద్దాల ధ్వంసం, ఇతర ఘటనలకు సంబంధించి ఐపీసీ 147, 148, 290, 353, 427, 149తో పాటు 3 పీడీపీపీ యాక్ట్ కింద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కొల్గూరుకు చేరుకున్న పోలీసులు అతనితో మాట్లాడుతూ తమ వాహనం ఎక్కాలని సూచించారు. ఈ సందర్భంలో ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మ, బంధువులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రశాంత్ సైతం తానూ వస్తానని చెబుతూనే తమ గ్రామసర్పంచ్ మల్లం రాజుతో ఒక్కసారి మాట్లాడించాలని పోలీసులను కోరాడు. ఈ సందర్భంలో మల్లం రాజు అక్కడికి రాగానే ప్రశాంత్‌తో పోలీసులు మాట్లాడించారు. ఆ తర్వాత ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు మహవీర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు జీపు ఎక్కించారు. ఈ సందర్భంలో తల్లిదండ్రులు, బంధువులు రోదించడం కనిపించింది.