హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందన్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగువారిగా గర్వకారణం అన్నారు. ‘నాటునాటు’ గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని సిఎం కేసీఆర్ పేర్కొన్నారు.
నాటు నాటు గీతం తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనం అన్నారు. తెలుగులోని మట్టి వాసనలను చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారని కెసిఆర్ కొనియాడారు. కీరవాణి, చంద్రబోస్ సహా రాజమౌళి బృందానికి సిఎం అభినందనలు తెలిపారు. హాలీవుడ్ కు తీసిపోని విధంగా తెలుగు చిత్రాలు రూపొందడం గొప్ప విషయం అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలుగు సినిమా కీర్తి ప్రపంచం మొత్తం వ్యాపించిందని ఆయన ప్రశంసలు కురిపించారు. నాటు నాటుకు ఆస్కార్ తెలుగు నేలకే కాదు దేశానికే గర్వకారణమన్నారు.