AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజాభవన్‌కు పోటెత్తిన ప్రజలు.. కిలోమీటర్ మేర క్యూ.. 5 గంటల నుంచే లైన్లు

గతంలో ప్రగతి భవన్‌గా ఉన్న పేరును జ్యోతిరావ్ పూలే ప్రజా భవన్‌గా మార్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే వారానికి రోజులు మంగళవారం, శుక్రవారాల్లో ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తెల్లవారుజాము వరకే ప్రజా భవన్‌కు చేరుకున్నారు. దీంతో ప్రజా భవన్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

గడ్డకట్టే చలిలో ఉదయం 5 గంటలకే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజా భవన్‌‌కు చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు ప్రజా భవన్‌ ముందు కిలోమీటర్ మేర క్యూ లైన్ పెరిగిపోయింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలను నియంత్రించడం ప్రజా భవన్ వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ప్రజావాణిలో ఎక్కువగా భూమి సంబంధిత సమస్యలు, ధరణి, ఆరోగ్యం, నిరుద్యోగం, పింఛన్లు, పింఛన్లు, ఇళ్లు వంటి అంశాలపైనే ఎక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాదర్భార్‌ పేరుతో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమానికి తొలిరోజు సీఎం రేవంత్‌ రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రజా దర్భార్ పేరును ప్రజావాణిగా మార్చారు. అప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు.

అయితే ప్రజావాణి కార్యక్రమం కేవలం ప్రజా భవన్‌లోనే నిర్వహించడం వల్ల రాష్ట్రం మొత్తం నుంచి ప్రజలు అందరూ హైదరాబాద్‌‌కే రావాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా భవన్‌లోనే కాకుండా నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలతో ప్రజావాణి నిర్వహిస్తే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజావాణి నియోజకవర్గాల్లోనూ నిర్వహించడం వల్ల స్థానిక సమస్యలు ఎక్కడికక్కడే త్వరగా పరిష్కారమవడమే కాకుం‍డా ప్రజలకు హైదరాబాద్‌ దాకా వచ్చే ఇబ్బంది కూడా ప్రజలకు తగ్గుతుందని పేర్కొంటున్నారు. దీంతో ప్రజాభవన్‌ వద్ద రద్దీ తగ్గి ఇక్కడి యంత్రాంగం మీద ఒత్తిడి తగ్గే అవకాశముంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

ANN TOP 10