సమర్థులతో రేవంత్ రెడ్డి పేషీ
జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం
ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్‌వో)గా మాజీ జర్నలిస్టు బి.అయోధ్య రెడ్డి నియమితులు కానున్నట్లు సమాచారం. ఈయన పలు మీడియా సంస్థల్లో పనిచేసి కాంగ్రెస్‌లో చేరారు. గత కంత కాలంగా టీ పీసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అయోధ్యరెడ్డి సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పని చేసి అనేక అంశాలపై తనదైన శైలిలో వార్తలను ప్రచురించి పలువురి మన్ననలను అందుకున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి ముఖ్య భద్రతాధికారి (సీఎస్‌వో)గా గుమ్మి చక్రవర్తిని నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎస్పీగా ఉన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి తన కార్యాలయంలో పనిచేసే బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) టీమ్‌లో ఎవరెవరు ఉండాలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పని తీరు, సామాజిక న్యాయం ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెలువడనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.









