AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాలనపై రేవంత్ మార్క్

పలువురు ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్
హైదరాబాద్ కొత్త బాస్‌గా కొత్తకోట
సైబరాబాద్, రాచకొండ కమిషనర్ల మార్పు
ఐఎస్ అధికారిణి అమ్రపాలికి కీలక పోస్ట్

పాలనపై పట్టు కోసం సీఎం రేవంత్ రెడ్డి కసరత్తును వేగవంతం చేశారు. నిన్నటి వరకు సీఎంవో ప్రక్షాళన అధికారుల నియామకం, బాధ్యతల వితరణ తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించిన సీఎం తాజాగా ఐపీఎస్, ఐఎఎస్ అధికారుల బదలీలు, బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమించిన ప్రభుత్వం సైబరాబాద్ సీపీగా అవినాష్ మహంతిని నియమించింది. రాచకొండ సీపీగా సుధీర్ బాబుకు బాధ్యతలు అప్పగించింది. యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యను నియమించింది. రాచకొండ సీపీగా ఉన్న చౌహాన్, సైబరాబాద్ సీపీగా ఉన్న స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఎన్నడూ లేని విధంగా ఏకంగా 20 మంది ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని సీఎస్‌ను ఆదేశించింది. బదిలీ అయిన వారిలో హైదరాబాద్, వరంగల్, నిజమాబాద్ సీపీలతో పాటు పలు జిల్లాల ఎస్పీలు ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులుగా పనిచేస్తున్న సందీప్‌ శాండిల్యను హైదరాబాద్ సీపీగా నియమించారు. తాజాగా ఆయన్ను యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్‌గా నియమించారు. సందీప్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని సీపీగా నియమించారు.

హైదరాబాద్ సీపీగా నియమించిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి నిజాయతీ గల అధికారిగా పేరుంది. రాష్ట్రంలో ఎక్కువసార్లు బదిలీ అయిన పోలీసు అధికారి ఆయనే కావడం గమనార్హం. ముక్కుసూటితనంతో ముందుకెళ్లే ఆయన కెరీర్ లో ఎక్కువ కాలం పాటు లూన్ లైన్‌ పోస్టింగ్‌లలోనే ఉండాల్సి వచ్చింది. గతంలో ఓ మంత్రికి లిక్కర్ సిండికేట్లలో ప్రమేయం ఉందనే విషయాన్ని బయటపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన బదిలీ తర్వాత ఆ కేసు ముందుకు సాగలేదు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లుగా నియమితులైన ముగ్గురు అధికారులు నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. వీరికి బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా రేవంత్ సర్కారు మరోసారి తన మార్క్‌ చాటుకుందని చెప్పొచ్చు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామనే విషయాన్ని నూతన ప్రభుత్వం చెప్పకనే చెప్పింది.

డైనమిక్ అధికారిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి రేవంత్ టీంలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమె డిప్యూటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం ఆమ్రపాలి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. తనదైన పనితీరుతో డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందారు. 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా కూడా ఆమ్రపాలి పనిచేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ పనిచేశారు. తాను పనిచేసిన వివిధ హోదాల్లో ఆమె తన ముద్రను వేసి మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా చేరారు. అక్కడ రెండేళ్ల పాటు పని చేసి డిప్యూటేషన్ పూర్తి కావడంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి రానున్నారు.

కాగా ఆమెకు రేవంత్ ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. ఆమె సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఆమ్రపాలి కూడా స్మితా సబర్వాల్‌లాగే డైనమిక్ ఆఫీసర్ దాంతో ఆమెకు కాంగ్రెస్ ప్రభుత్వంలో, మరీ ముఖ్యంగా రేవంత్ టీంలో కీలక పోస్టు లభిస్తుందనే ప్రచారం జోరందుకుంది.

ANN TOP 10