AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం..: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుని సమర్థిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్‌ ప్రజల ఐక్యత, పురోగమనం, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను త్రోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దుపై ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. 5 ఆగస్టు 2019న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది’’ అని పోస్ట్ చేశారు.

దృఢమైన విశ్వాసం కలిగిన జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌ ప్రజల కలలను సాకారానికి నిబద్ధతతో ఉన్నామని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రగతి ఫలాలను సాధారణ ప్రజలతోపాటు సమాజంలో అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన సమాజానికి అభివృద్ధి ఫలాలను అందజేస్తామని అన్నారు. సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు కాదని, ఇదొక ఒక ఆశాకిరణంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానమని, ఉమ్మడి భారతదేశాన్ని నిర్మించాలనే సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.

ANN TOP 10