హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేే కేసీఆర్‌ను పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌ను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. తాజాగా, తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించారు. అనంతరం కేటీఆర్, కవిత, హరీశ్ రావులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర మరువలేనిదని అన్నారు. కేసీఆర్ కు గాయం కావడం బాధాకరమన్నారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి కేటీఆర్, కవితతో చర్చించానని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి వెంకట్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హనుమంతరావు, కోదండ రెడ్డి, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్, ఎంపీ గుండూరు రాములు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు కేసీఆర్‌ను పరామర్శించారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోని బాత్రూంలో కాలు జారి పడటంతో కేసీఆర్ కు గాయమైంది. వెంటనే ఆయనను సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు.. ఆయనకు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఆయనకు 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.