తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి (శనివారం) నుంచి ప్రారంభంకానున్నాయి. దీనికి సంబంధించి గెజిటెడ్ నోటిఫికేషన్ వెలువడనుంది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి అసెంబ్లీ సమావేశాలు కావటం గమనించాల్సిన విషయం. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమం తరువాత స్పీకర్ ఎన్నికకు నోటిషికేషన్ వెలువడనుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేల్లో సీనియర్లను ప్రొటెం స్పీకర్ గా నియమించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రతిపక్షాలు స్పీకర్ బాధ్యతలు తీసుకోకుంటే.. అధికార పక్ష ఎమ్మెల్యేల బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఈక్రమంలో ప్రొటెం స్పీకర్ గా ఎవరిని నియమిస్తారో అనే ఆసక్తి సాగుతోంది.
కాగా.. ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఒకరిని ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమిస్తారు. నియమించబడిన స్పీకర్ తో రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ శాసనసభలో ప్రమాణస్వీకారం చేయిస్తారు. సభ్యుల ప్రమాణస్వీకారం సమయంలో ఉభయసభల్లోని సభ్యులను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.