‘మిచౌంగ్’ తుఫాన్ భయాందోళనకు గురిచేస్తోంది. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం తుపాన్‌గా మారింది. దీంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో అలలు ఎగసిపడుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షించేందుకు అధికారులు నాగాయలంక, కోడూరు మండలాలకు చేరుకున్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపిస్తున్నారు. తుఫాను దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. మిచౌంగ్ తుఫానుతో అప్రమత్తమైంది ఏపీ సర్కారు. నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చన్న సమాచారంతో కలెక్టర్లతో సమీక్ష జరిపారు సీఎం జగన్. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారుల్ని నియమించారు. NDRF, SDRFతో పాటు అవసరాన్ని బట్టి వాలంటీర్లు, గ్రామ సచివాలయం సేవల్ని ఉపయోగించుకోవాలన్నారు.
మిచాంగ్ తుపాను దిశను మార్చుకున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది సూళ్లూరుపేట వద్ద కేంద్రీకృతమై ఉందని తెలిపింది. అంతేకాక అర్ధరాత్రి నెల్లూరు సమీపాన తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటిన తర్వాత భూమార్గంలో నిదానంగా ప్రయాణిస్తుందన్నది. ఒంగోలు , విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా ప్రయాణించనుందని పేర్కొన్నప్పటికీ…. అకస్మాత్తుగా తన దిశను మార్చుకుని నెల్లూరు కావాలి మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని కూడా తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.









